తెలుగులో మరో హార్ట్ టచింగ్ మూవీ రాబోతోంది. కమల్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్దేష్ దర్శకత్వంలో, డా. ఉమారావు నిర్మాణంలో సత్యప్రకాష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘నాన్నా మళ్లీ రావా..!’. సత్యప్రకాష్, ప్రభావతి, రిత్విక్, హరీక, శిరీష తదితరులు నటించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటోంది.
ఈ సందర్భంగా ప్రధాన పాత్రలో నటిస్తున్ననటుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ.. ఇలాంటి భావోద్వేగంతో మిలితమైన సినిమాలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయని, కుటుంబ సమేతంగా చూడగలిగే ఈ సినిమా ప్రతి ఒక్కరిలో భావోద్వేగాలు నింపుతాయని చెప్పారు.
దర్శకుడు నిర్దేష్ మాట్లాడుతూ.. ”వెంకన్న క్యారెక్టరే నన్ను ఈ కథ రాయించినట్టు అనిపించింది. నాన్న అంటే ప్రతి ఒక్కరికి చెప్పుకోలేనంత భావోద్వేగం ఉంటుంది. థియేటర్లో ఈ సినిమా చెప్పలేనంత భావోద్వేగంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను..” అని అన్నారు.
నటీ ప్రభావతి మాట్లాడుతూ.. ”నేను ఈ సినిమాలో తల్లి పాత్రలో చేశారు. నాన్న గురించి మాట్లాడుతుంటేనే ఏడుపు వస్తుంది. డైరెక్టర్ నిర్దేష్ గారు రాసుకున్న కథ సినిమాను ఎంతో ఎత్తులో నిలబెడుతుంది. భావోద్వేగాలను మిలితం చేస్తూ వస్తున్న ‘నాన్నా మళ్లీ రావా..!’ సినిమా ఒక ట్రెండ్ సృష్టిస్తుందన్న నమ్మకం ఉంది..” అని అన్నారు.
తెలుగు ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో నచ్చే సబ్జెక్టుతో ఈ సినిమా తెరకెక్కినట్టు ఈ చిత్ర నిర్మాత డా. ఉమారావు ధన్యవాదాలు చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.